దొమ్మరాజు గుకేశ్ ప్రస్తుతం ఈ పేరు భారత దేశంలో మార్మోగిపోతుంది. ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకు కారణం అతడు సాధించిన ఘనతే. భారత యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ చెస్ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గురువారం జరిగిన చివరి రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి కొత్త చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల, 8 నెలల, 14 రోజుల వయసులో గుకేశ్ చెస్ లో విశ్వవిజేతగా అవతరించాడు. ఈ రికార్డు ముందు గారీ కాస్పరోవ్ పేరిట ఉండేది. అతను 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయసులో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.
ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్ తెలుగు మూలాలున్న అబ్బాయి. అతడి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలోని చెంచురాజు కండ్రిగ గ్రామానికి చెందినవారు. గుకేశ్ ముత్తాతలు అక్కడ నివసించగా.. గుకేశ్ తల్లిదండ్రులు మాత్రం చెన్నైలో స్థిరపడ్డారు. గుకేశ్ తెలుగు కూడా చక్కగా మాట్లాడగలడు. గతంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా గుకేశ్ తెలుగులో చక్కగా మాట్లాడాడు .
ఇక గుకేశ్ ఈ స్థాయికి చేరుకోవడంలో అతడి తల్లిద్రండుల పాత్ర ఎంతో ఉంది. గుకేశ్ తండ్రి రజనీకాంత్ ఈఎన్‌టీ సర్జన్.. తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. చిన్న తనం నుంచే గుకేశ్ కు చెస్ పట్ల ఆసక్తి ఏర్పడింది. దానిని సీరియస్ గా ప్రాక్టీస్ చేసేవాడు. దాంతో తండ్రి గుకేశ్ వెంటే ఉండేవాడు. గుకేశ్ కెరీర్ కోసం ఆరేళ్ల క్రితం తండ్రి తన ప్రాక్టీస్ ను వదిలేశాడు. వెన్నంటే ఉంటూ విజయం వైపు నడిపించాడు. చెస్ చాంపియన్ గా అవతరించిన వెంటనే గుకేశ్ భావోద్వేగానికి గురయ్యాడు. పావులను యథాస్థానంలో అమర్చుతూ ఆనందభాష్పాలతో దేవుడిని ప్రార్థించాడు. ఆ తర్వాత తన తండ్రి రజినీకాంత్‌ను హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు.