దాదాపు 5,500 ఎకరాలకు పైగా విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా నిలిచింది శంషాబాద్‌లోని మన రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌. GMR గ్రూప్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), తెలంగాణ ప్రభుత్వం కలిసి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో(PPP) విమానాశ్రయాన్ని నడుపుతున్నాయి. విమానాశ్రయం ఏర్పాటు నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎయిర్‌పోర్ట్ మెయింటేనెన్స్‌లోనూ ఎన్నో అవార్డులను గెలుచుకుంటోంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో పాటు పర్యావరణ హిత విధానాలను అవలంబిస్తూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ మిగతా ఎయిర్‌పోర్ట్‌లకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది.

డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాల కోసం ఇ-బోర్డింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తొలి భారతీయ ఎయిర్‌పోర్ట్‌గా కూడా రాజీవ్‌గాంధీ విమానాశ్రయం రికార్డు క్రియేట్ చేసింది. తద్వారా విమానం బోర్డింగ్ ప్రాసెస్‌లో ప్యాసింజర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా ఫ్లైట్ ఎక్కే సౌకర్యం కలిగింది. దీంతోపాటు ప్రయాణికుల రద్దీని తట్టుకునే విధంగా ఎయిర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్ ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకించి దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాలు తీర్చడానికి షాపింగ్, డైనింగ్, లాంజ్‌లతో పాటు మెరుగైన ట్రాన్స్‌పోర్ట్ సేవలను అందిస్తోంది. 5,500 ఎకరాల విస్తీర్ణంతో కూడుకున్న ఈ ఎయిర్‌పోర్ట్‌లో 12 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించొచ్చు.

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఏటా ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. 2023తో పోలిస్తే ఈ సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ 11శాతం పెరిగింది. డొమొస్టిక్ ట్రాఫిక్ 10 శాతం, ఇంటర్నేషనల్ ట్రాఫిక్ 14 శాతం మేర పెరిగింది. ప్రయాణికుల రాకపోకల విషయంలో హైదరాబాద్ కంటే జనాభాలో ముందున్న చెన్నై, కోల్‌కతా వంటి మెట్రో నగరాలను సైతం ఈ ఏడాది దాటేసింది. ఇదే కాకుండా ప్యాసింజర్ల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు దేశంలోని పలు నగరాలకు సైతం ఇక్కడి నుంచి విమాన సర్వీసులు మొదలయ్యాయి. హైదరాబాద్ నుంచి 6 నగరాలకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభమయ్యాయి.