వికసిత భారత్ లో విజ్ఞాన సమూహం అవసరం
- రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాహితీ యాత్రకు త్వరలో శ్రీకారం
- సాహితీవేత్తలు, రచయితల ఇళ్లను ఆలయాల్లా కాపాడుకోవాలి
- యువతరం సోషల్ మీడియాను వదిలి పుస్తక పఠనం అలవర్చుకోవాలి
- ప్రతి పుస్తక రచనా వెనుక అపారమైన శ్రమ దాగుంటుంది
- నాకు జీవితంలో ధైర్యం నింపింది పుస్తకాలే
- నా వెన్నంటే అవి అంగరక్షకుల్లా తోడుంటాయి
- భాషను బతికించుకునేందుకు అంతా ముందుకు రావాలి
- విజయవాడ 35వ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించి, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘నాకు జీవితంలో నిలబడే ధైర్యం ఇచ్చింది పుస్తకాలే. నిరాశలో ఉన్నపుడు దారి చూపింది పుస్తకాలే. 2047కు వికసిత భారత్ గా వేగంగా అడుగులు వేస్తున్న వేళ విజ్ఞానకాంతులు నిండే సమూహం అవసరం. అందుకు పుస్తకాలు దారి చూపుతాయ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. రేపటి యువత సాహితీ సంపదను కాపాడేలా తయారు కావాలన్నారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఓ వినూత్నమైన సాహితీయాత్రను మొదలుపెట్టబోతోందని చెప్పారు. తెలుగుభాషకు వన్నెతెచ్చిన గొప్ప సాహితీ మేధావులు, రచయితల గృహాలను, వారు నడయాడిన నేలను భవిష్యత్తు తరాలవారు అక్షర ఆలయాలుగా దర్శించేలా, అక్కడ భాషా పరిశోధన జరిగేలా ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా మైదాన్ లో నిర్వహిస్తున్న 35వ పుస్తక ప్రదర్శన మహోత్సవాన్ని గురువారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. అనంతరం ఈనాడు పత్రిక మాజీ సంపాదకులు, దివంగత శ్రీ చెరుకూరి రామోజీరావు స్మారక వేదికపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘నాకు చిన్ననాటి నుంచే పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. 5వ తరగతి నుంచి పాఠ్యపుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలను చదివే వాడిని. నెల్లూరులో 7వ తరగతిలో ఉన్నపుడే భవానీ బుక్ సెంటర్ యజమాని రమేశ్ గారితో స్నేహం ఏర్పడి అక్కడే కూర్చొని పుస్తకాలు చదివేవాడిని. నా దగ్గరున్న కోటి రూపాయాలు ఇవ్వమన్నా ఇచ్చేస్తా కానీ.. ఒక్క పుస్తకం ఇవ్వడానికి మాత్రం చాలా సంకోచిస్తాను. కర్ణుడికి కవచ కుండలాలు ఎలాగో నాకు పుస్తకాలు అలాగే ఉండాలనిపిస్తాయి. కావాలంటే అడిగిన పుస్తకాన్ని కొని ఇస్తాను అని చెబుతాను కానీ.. నా దగ్గర ఉన్న పుస్తకం మాత్రం ఇవ్వడానికి ఇష్టపడను. నాకు పుస్తకమంటే అంతటి మమకారం. పుస్తకాలే నా వెంట లేకపోతే ఈ రోజున ఏమైపోయేవాడినో అనిపిస్తుంటుంది. - ఇంటర్ తో చదువు ఆపేసినా పఠనం ఆగలేదు
నాకు శ్రీ రవీంధ్రనాథ్ ఠాగూర్ ఓ స్ఫూర్తి. ఆయన కూడా చదువు తక్కువే చదివినా ఎన్నో కావ్యాలు రాశారు. క్లాస్ రూం పుస్తకాలు చదవకున్నా, పఠనం మాత్రం నేను ఎప్పుడూ ఆపలేదు. ఇంటర్ తో చదువు ఆపేసినా కూడా ప్రకృతి ప్రేమికుడిగా మారి నాకేం కావాలో తెలుసుకొని దాన్ని చదవడం ద్వారా జ్ఞానం పెంచుకున్నాను. స్వతంత్రంగా నాకు ఏం కావాలో నేర్చుకోగలను అనే ధైర్యం వచ్చినపుడు నేను పఠనం మీద దృష్టి నిలిపి నాకు ప్రత్యేకంగా టీచర్ అవసరం లేదని నిర్ణయించుకున్నాను. నాకు ఓటమిలోనూ అద్భుతమైన మానసిక శక్తిని పుస్తకాలే అందించాయి. - రైతుకు మట్టి సువాసనలా.. సాహితీప్రియుడికి పుస్తక సువాసన
సినిమాలు విజయవంతం అయితే దాన్ని పెద్దగా పట్టించుకోను. కాని ఓ అద్భుతమైన పుస్తకం తర్వాత వచ్చే అనుభూతి నాకు గొప్పగా ఉంటుంది. అమృతం కురిసిన రాత్రి, విశ్వదర్శనం వంటి పుస్తకాలు మద్రాసులో చదవడం మొదలుపెట్టినపుడు ఓ రకమైన అద్భుతమైన అనుభూతిపొందేవాడిని. కొత్త పుస్తకాలు తెచ్చుకొని వాటి సువాసన చూస్తుంటే… పొడిబారిన నేలలో కొత్త చినుకులు వచ్చి రాలితే వచ్చే సువాసన ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. డాక్టర్ కేశవరెడ్డి గారి అతడు అడవిని జయించాడు చదివితే చుక్క పందులు వెళ్లిపోతే ఓ గిరిజనుడు పడే వేదన అర్ధం అవుతుంది. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి హాహా ఊహు చదివితే మన సంస్కృతి పట్ల అవగాహన వస్తుంది. శ్రీ గుర్రం జాషువా గారి రచనలు చదివితే సాహిత్యకారుల మీద ప్రేమ పుడుతుంది.. చివుకుల పురుషోత్తం గారు రాసిన బంగారం తయారుచేయడం ఎలా అనే పుస్తకం చదివితే సాహసాలు చేయాలనే తపన వస్తుంది… ఆయనే రాసిన ఏది పాపం? పుస్తకం చదివితే జీవితంలో ఎంత కష్టపడాలో అవగతం అవుతుంది. ధర్మవడ్డీ పుస్తకం చదివితే మనుషుల స్వభావాలు అర్ధం అవుతాయి… వనవాసి చదివితే అడవిలో రమ్యతను అక్షరాల్లో ఎలా నింపాలో తెలుస్తుంది. నన్ను ఇలా ఎన్నో పుస్తకాలు జీవితంలో ప్రభావితం చేశాయి. తెలుగులో అద్భుతమైన సాహిత్యం ఉంది. చదువుతూ వెళ్తూ ఉంటే మనసు తలుపులు తెరుచుకుంటాయి. - జ్ఞానవంతులను గౌరవించుకుందాం
మన మధ్య ఎందరో జ్ఞానవంతులున్నారు. వారిని మనం గౌరవించుకోవాలి. మేధావులు మౌనంగానే ఉంటారు. వారి వద్దకే మనం వెళ్లి విషయాలను సంగ్రహించాలి. ఒక్కో పుస్తకం రాయడానికి ఎంతటి కష్టం ఉంటుందో, ఒక్కో ప్రసంగం రాయడానికి ఎంతటి శ్రమ ఉంటుందో నాకు తెలుసు. భాష, వ్యాకరణం, పదప్రయోగం, శైలిపై ఎంతటి పట్టు ఉంటే వారి చేతి నుంచి ఇంతటి గొప్ప పుస్తకాలు వస్తాయో మనం తెలుసుకోవాలి. ఎంత వేదన నుంచి మహాప్రస్థానం ఉద్భవించిందో, ఎంతటి జ్వలనం నుంచి అమృతం కురిసిన రాత్రి ఆవిష్కృతం అయిందో మనం మనసుతో అర్ధం చేసుకోవాలి. నేను చదువుకునే రోజుల్లో తెలుగు అధ్యాపకుల్ని, టీచర్లను సరిగా అర్ధం చేసుకోలేకపోయాను అనిపిస్తుంది. మాతృభాష మీద నేటి చిన్నారులు దృష్టి సారించాలి. పుస్తకాలు చదివితే ఊహాశక్తి, సృజనాత్మకత, సమాజాన్ని అర్ధం చేసుకునే గుణం పెరుగుతాయి. పాఠశాల విద్యార్థులు తెలుగు వ్యాకరణం, చంధస్సు నేర్చుకోవాలి. ఆంగ్ల భాష నేర్చుకోవడం అవసరమే. అందుకోసం మాతృ భాషను వదులుకోనవసరం లేదు. - సాహితీ కేంద్రాలుగా రచయితలు, కవుల ఇళ్ళు
తెలుగు నేలలో గొప్ప రచయితలు, కవులు, మేధావులు పుట్టారు. సాహితీవేత్తలు భాష కోసం చేసిన సేవ ఎనలేనిది. నేటి తరానికి ఆ కృషి, వారి శ్రమ తెలియాలి. శ్రీ గుర్రం జాషువా, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ గురజాడ అప్పారావు గారి వంటి మహోన్నతులు మన రాష్ట్రంలోనే పుట్టారు. అలాంటి గొప్ప రచయితలు, కవులు అప్పట్లో నివసించిన ఇళ్లను సాహితీ కేంద్రాలుగా చేయాలనే ఆలోచన ఉంది. దీనిపై పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మహనీయులు నివసించిన ఆ ఇళ్లను సాహితీకేంద్రాలుగా చేసి, అక్కడ పర్యాటకాన్ని పెంపొందించే ఆలోచన చేస్తున్నాం. దీనివల్ల మనం గుడికి వెళ్తే ఎంత తన్మయత్వం పొందుతామో… అక్షర రుషుల ఇళ్లకు వెళ్లినపుడు అదే అనుభూతి వచ్చే తరాలు పొందాలన్నదే మా ఆకాంక్ష. వారి శ్రమ, కృషి మీద పరిశోధనలు జరగాలి.. పుస్తకాలు రావాలి. భావితరాలు మన రచయితల గురించి తెలుసుకోవాలి. భాషను బ్రతికించుకునేందుకు వారు ముందుకు రావాలి. తప్పులు దొర్లకుండా రాయాలంటే చాలా కష్టపడాలి. సూర్యరాయాంధ్ర నిఘంటువు ముద్రణ కోసం ప్రయత్నిస్తున్నాం. నిఘంటువును ఆసాంతం చదివితే భాష మీద పట్టు పెరుగుతుంది. సూర్యరాయాంధ్ర నిఘంటువును పున:ముద్రణకు సుమారుగా రూ.1.75 కోట్లు అవుతుందని చెప్పారు. దానిలో మూడో వంతును నేను భరిస్తాను. దానికి సంబంధించి పనులు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. - సోషల్ మీడియా కాదు.. పుస్తకం పట్టండి
నేటి తరం ఫేస్ బుక్, ట్విట్టర్ లోనే అధిక సమయం గడుపుతున్నారు. దానికంటే మానసికంగా మనల్ని బలవంతులు చేసే పుస్తకాలను ఎంచుకొని చదవండి. దీనివల్ల మీరు మానసికంగా బలంగా మారుతారు. సమస్యలను, కష్టాలను, మనుషులను అర్ధం చేసుకునే తత్వం బోధపడుతుంది. సోషల్ మీడియాలో గంటలకు గంటలు గడిపేకంటే పోరాటం చేసే శక్తిని నింపే పుస్తకాలను పట్టుకోండి.
నేను విపత్కర సమయంలో ఉన్నపుడు శ్రీ గుంటూరు శేషేంద్రశర్మ గారి వాక్యాలే తూటాలయ్యాయి. శ్రీ బాలగంగాధర్ తిలక్ గారి మాటలే శరములయ్యాయి. ఓ గొప్ప రచయిత మన వెంట లేకున్నా ఆయన స్ఫూర్తి నింపిన అక్షరాలు మనల్ని తట్టి లేపుతాయి. నేను అందుకే వారిని గౌరవిస్తాను. ఇటీవల నేను ఓ సదస్సులో అధ్యాపకులు, ఉపాధ్యాయులకు అందరికంటే ఎక్కువ వేతనాలు ఉండాలని చెప్పడానికి కారణం ఇదే. నేను ఎక్కడికి వెళ్లినా పుస్తకాలు నా వెంట లేకుంటే ఏదో లోటు ఉందనే భావన ఉంటుంది. ఏదో వదిలి వచ్చాననే వెలితి ఉంటుంది. పుస్తకాలు నాకు అంగరక్షకులు. తొలిప్రేమ సినిమాకు రూ.15 లక్షల పారితోషికం వస్తే.. దానిలో రూ.లక్ష పెట్టి పుస్తకాలు కొనుక్కోని దేన్ని చదవాలో తెలియక అన్ని పుస్తకాలు చూసి ఆనందపడిన వ్యక్తిని. ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో 10 వేల పుస్తకాలు చదవవచ్చని నిపుణులు చెబుతారు. మన అభిరుచి ఆధారంగా మీ విజ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నించండి. పుస్తకాలలో ఉన్న మేధ మరెక్కడా దొరకదు. మీరంతా పుస్తక ప్రియులు కావాలని, తెలుగు భాషను రక్షించాలని, సాహితీవేత్తలను గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. - శ్రీ పి.వి.నరసింహారావు గారి స్మృతి చిహ్నం సాధించుకుందాం
మాజీ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు గారి లిటరరీ మోనోగ్రాఫ్ పుస్తకం ఓ దిక్సూచి. దేశానికి దశ, దిశా చూపిన మహానుభావుడు శ్రీ పీవీ నరసింహారావు గారు. ఇక నాకు రాజకీయాలు లేవు అని తన సొంత గ్రంథాలయాన్ని స్వస్థలానికి తరలించుకునే తరుణంలో ఆయన అనుకోకుండా ప్రధాని అయ్యారు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన వేయి పడగలు గ్రంథాన్ని హిందీలో సహస్ర ఫణ్ పేరుతో అనువదించారు. అలాంటి గొప్ప సాహితీవేత్త, బహుభాషా కోవిదులైన శ్రీ పీవీ నరసింహారావు గారికి వినమ్రంగా నమస్కరించడం తప్పితే అలాంటి మహనీయుడి గురించి మాట్లాడే అర్హత ఉందనుకోను. అంతటి మేధ వచ్చినపుడు ఆయన గురించి బలంగా మాట్లాడుతాను. కాని నా ఆకాంక్ష మాత్రం ఒకటి ఉంది. ఇలాంటి గొప్ప తెలుగువ్యక్తికి, ప్రధానమంత్రిగా దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని మరో పథంలోకి తీసుకెళ్లని గొప్ప నాయకుడు శ్రీ పీవీ గారు. ఈ రోజున ఇంతటి అభివృద్ధి జరుగుతోందంటే.. రోడ్లు, సౌకర్యాలు, మౌలిక వసతులు వేగంగా సమకూరుతున్నాయంటే దానికి శ్రీ పీవీ నరసింహారావు గారు, శ్రీ మన్మోహన్ సింగ్ వంటి వారు కారణం. అలాంటి గొప్ప వ్యక్తి తనువు చాలించిన తర్వాత ఢిల్లీలో సరైన అంతిమ సంస్కార కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించలేదు. ఢిల్లీలో ఆయనకు నివాళి అర్పించుకుందాం అంటే సరైన వేదిక లేదు. ఈ రోజున తెలుగువారిగా మన సంకల్పం ఏమిటంటే – శ్రీ పీవీ గారికి ఢిల్లీలో స్మృతిచిహ్నం సాధించుకోవాలి. రాజకీయాలకు అతీతంగా మనమంతా ఐక్యంగా సాధించుకుందాం. ఇది మనందరి ఆత్మగౌరవ ప్రతీకగా మార్చుకుందాం’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, ఈనాడు ఎడిటర్ శ్రీ మానికొండ నాగేశ్వరరావు, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ కృత్తివెంటి శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి అసొసియేట్ ఎడిటర్ శ్రీ అప్పరసు కృష్ణారావు, ఎమ్మెస్కో ప్రచురణల అధిపతి శ్రీ విజయ్ కుమార్, విజయవాడ పుస్తక మహోత్సవ ప్రతినిధులు శ్రీ టి.మనోహర్ నాయుడు, శ్రీ లక్ష్మయ్య, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు.