• మంగళగిరిలో కోటి దీపోత్సవంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన
  • కాలినడకన వెళ్లి గండాల నరసింహస్వామి దర్శనం
  • మొక్కులు తీర్చుకుని గండ దీపం వెలిగించిన లోకేష్

కార్తీక పౌర్ణమి వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ సందడి చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళగిరిలో దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర గాలి గోపురం వద్ద ఓంశ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కోటి దీపోత్సవంలో పాల్గొని అఖండ కోటి దీపం వెలిగించారు.

ముందుగా కోటిదీపోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి పండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారా లోకేష్ పానకాల లక్ష్మీనరసింహ ఆలయానికి చేరుకుని అక్కడి నుంచి మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి కొండ శిఖరాగ్రాన కొలువై ఉన్న గండాలయ నరసింహస్వామిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకుని గండ దీపాన్ని వెలిగించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.