రాజమహేంద్రవరం దివానచెరువు అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత గత మూడు రోజులుగా జాడ లేకపోవడం తెలిసింది. అయితే మంగళవారం రాత్రి కడియం నర్సరీ ప్రాంతాల్లో చిరుత జాడ కనిపించడం అడవి శాఖ అధికారులు ధ్రువీకరించడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.దివానచెరువు ప్రాంతం నుంచి ఈ చిరుత కడియం ప్రాంతానికి వచ్చినట్లు కాలి ముద్రల ద్వారా అధికారులు నిర్ధారించారు. అయితే కడియం- వీరవరం రోడ్ మధ్యలో ఉండే దోషాలమ్మ కాలనీలో ఈ చిరుత జాడలు కనిపించడంతో ఆ కాలనీ వాసులంతా తీవ్ర భయాందోళన చెందారు. అడవి శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి చిరుత జాడల ఉన్నట్లు గుర్తించారు.అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది అంతుపట్టడం లేదు.

కొన్ని నర్సరీలలో సీసీ కెమెరాలు ఉంటాయి. కాని ఇప్పుడు అందరూ భయపడి రైతులు ఎవరు నర్సరీలో ఉండడం లేదు. దీంతో చిరుత ఆ ప్రాంతంలోనే ఉందా అక్కడి నుంచి సమీపమైన ఆలమూరు లేదా మండపేట మండలాల పరిధిలోకి వెళ్ళిందా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ చిరుత ఎప్పుడు ఎక్కడికైనా వెళ్లగలగే అవకాశం ఉంటుంది. ఏదేమైనాప్పటికీ ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అడవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.ఎవరూ బయటకు రావద్దని,ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలని,దగ్గరగా ఉండే మైకులు పలుకుతూ ఉండాలని సూచించారు.