హైదరాబాద్ మహానగరంలో ఏటా గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అందులో ఖైరతాబాద్ గణేశుడిది ప్రత్యేక స్థానం. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాధుడు ఈసారి శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.ఖైరతాబాద్ మహా గణపతిని 1954లో తొలిసారిగా ప్రతిష్ఠించారు.ఖైరతాబాద్‌లో ఈ ఏడాది 70 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్టియించారు. సుమారు 22 టన్నుల పైచిలుకు ఐరన్‌ను విగ్రహతయారీలో వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మహా గణపతి నిర్మాణంలో మంచి నాణ్యత గల వస్తువులను వినియోగిస్తున్నట్లు కళాకారులు తెలిపారు. ఈ కళాకారులు వినాయకుడి ప్రతిమను తయారు చేయడానికి మహారాష్ట్ర, వెస్ట్‌ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ నుంచి వచ్చారు.