సీఎం చంద్రబాబు సర్కార్ ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది. నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీను కూటమి సర్కార్ నెరవేర్చబోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో అర్హులకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందించలేదు. తాజాగా కూటమి సర్కార్ రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని సిద్దమవుతోంది.

ఈ క్రమంలో డిసెంబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ డిసెంబర్ 28 వరకు కొనసాగుతుంది తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేసినప్పటికీ, కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయలేదు. అయితే పెళ్లైన కొత్త జంటలు, కుటుంబ సభ్యుల జాబితాలో మార్పులు చేర్పులు చేయాల్సినవారు, ఇంకా అర్హత గల ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2025 సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలలో అందిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, అర్హులైన వారికి తక్షణమే రేషన్ కార్డులు జారీ చేసే విధంగా రంగం సిద్ధం చేస్తోంది కూటమి సర్కార్. మ్యారేజ్ సర్టిఫికేట్‌ను ఆధారంగా చేసుకుని కొత్తగా పెళ్లైన వారికి రేషన్ కార్డులు అందించే ప్రయత్నాలు చేస్తోంది ఏపీ సర్కార్.

గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డుల డిజైన్లను కాకుండా ఈ సారి రేషన్ కార్డులు ప్రత్యేక డిజైన్‌లో అందించనున్నట్లు తెలుస్తోంది. కార్డులపై కుటుంబ సభ్యుల ఫోటోలతో పాటు క్యూఆర్ కోడ్‌ను కూడా చేర్చనున్నట్లు సమాచారం. క్యూఆర్ కోడ్ ద్వారా రేషన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ప్రభుత్వం సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులను ప్రజలకు అందజేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించినట్లు సమాచారం. రేషన్ కార్డులు రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు కీలక ప్రామాణికంగా మారిన ఈ పరిస్థితుల్లో, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రజలకు మరింత సౌలభ్యాన్ని అందించనున్నాయి.

అయితే గత ప్రభుత్వ హయాంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా తెల్ల రేషన్ కార్డులు పొందినట్లు ఆరోపణలు రావడంతో కూటమి సర్కార్ మరోసారి వారి వివరాలను పరిశీలించి వారి అనర్హులను గుర్తించి వారి రేషన్ కార్డులను రద్దు చేయనున్నట్లు సమాచారం.