గిరిశిఖర గ్రామాల్లో రోడ్ల పండుగ
•భారీ ఎత్తున రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు
•పార్వతీపురం మన్యం జిల్లాలో రూ. 36.71 కోట్ల వ్యయంతో నూతన రోడ్ల నిర్మాణం
•బాగుజోల-సిరివర మధ్య రూ. 9.50 కోట్లతో బీటీ రోడ్డు
•గిరిజన గ్రామాల్లో తీరనున్న డోలీ మోత కష్టాలు
గిరి శిఖర గ్రామాల్లో అడవి బిడ్డలకు అరోగ్య అత్యవసర పరిస్థితులు ఎదురైతే డోలీల్లో మోసుకొని కిలో మీటర్ల కొద్దీ నడుచుకొంటూ వెళ్ళే కష్టాలు తీరనున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల పండుగ మొదలయ్యింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటూ గిరిజన గ్రామాల డోలీ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని గిరిజన గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారితో కలసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలం, పనసభద్ర గ్రామ పంచాయతీ పరిధిలోని బాగుజోల – సిరివర మధ్య మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద రూ. 9.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను బాగుజోల వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ రహదారి నిర్మాణంతో సిరివర, చిన్న మండంగి, చిలక మండంగితో పాటు మరికొన్ని గిరిశిఖర గ్రామాల వాసులక డోలీ కష్టాలు తీరనున్నాయి.
ఇదే ప్రాంతంలో పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని మరో 19 గిరిజన గ్రామాల్లో 16 పనుల బీటీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన శిలా ఫలకాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఉపాధి హమీ పథకం కింద రూ. 20.11 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మించనున్నారు. వీటితోపాటు మొత్తం రూ. 36.71 కోట్ల అంచనా వ్యయంతో 39.32 కిలోమీటర్ల మేర 19 నూతన రోడ్లు నిర్మించనున్నారు. ఈ రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాల్లో నివశిస్తున్న సుమారు 3,782 మంది గిరిజనులు డోలీ మోత కష్టాల నుంచి విమక్తి పొందనున్నారు.
•గిరిజన గ్రామాల్లో స్థితిగతులపై ఎగ్జిబిషన్
అంతకు ముందు బాగుజోల వద్ద గిరిజన గ్రామాల్లో స్థితిగతులు, ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనుల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు, ఆ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, రహదారుల నిర్మాణం తదితర అంశాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిలకించారు. సంబంధిత అధికారులను అడిగి ఫోటోల్లోని అంశాలకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు, శ్రీమతి జగదీశ్వరి గారు, శ్రీమతి లోకం మాధవి గారు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారు, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్రీ ఎ. శ్యాం ప్రసాద్ గారు, ఎస్పీ శ్రీ మాధవరెడ్డి గారు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.