సీఎం రేవంత్ రెడ్డి ఒకటే కార్డుతో అన్ని రకాల ప్రయోజనాలూ అందేలా ప్లాన్ చేశారు. ఈ కార్డుల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
సికింద్రాబాద్ లోని హాకీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుటుంబ గుర్తింపు, కుటుంబ డిజిటల్ కార్డును సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తెచ్చామన్నారు. ఇవాళ్టి నుంచి 119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నాం. రేషన్ కార్డు కావాలని ప్రజలు పదేళ్లు చెప్పులరిగేలా తిరిగినా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదు. ప్రతీ పేద వాడికీ రేషన్ కార్డు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. అందుకే ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం. కొంతమందికి రేషన్ కార్డుకి, ఫ్యామిలీ డిజిటల్ కార్డుకూ తేడా తెలియకపోవడం దురదృష్టకరం. సంక్షేమ పథకాల అమలు విషయంలో వివిధ శాఖల సమాచారమంతా ఒకే కార్డులో పొందుపరుస్తాం. 30 శాఖల సమాచారం ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వన్ స్టేట్ వన్ కార్డు విధానంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకే ఈ విధానం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మీ కుటుంబాలకు ఒక రక్షణ కవచంలా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉంటుంది. అన్ని సంక్షేమ పథకాలూ ఒకే కార్డు ద్వారా అందించనున్నాం. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ కూడా పొందుపరుస్తాం. పేదలను ఆదుకునేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు, అమలులో సమస్యలు గుర్తించేందుకు ఇవాళ పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నాం. పైలట్ ప్రాజెక్ట్‌లో వచ్చే సమస్యల ఆధారంగా పరిష్కారాలతో ముందుకెళతాం. ప్రతీ నియోజకవర్గానికి ఒక ఆర్డీవో స్థాయి అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమిస్తున్నాం. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళనే కుటుంబ పెద్దగా పొందుపరుస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.