పేదల ఇళ్లలో విద్యుత్ ఆదా పెంచి, బిల్లు తగ్గించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా 1.50 లక్షల పేదల ఇళ్లకు విద్యుత్ సేవలు మెరుగుపరచే పనులు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) తో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSHCL), ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSEEDCL) ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ ప్రాజెక్టు మొదట చిత్తూరు జిల్లాలో ప్రారంభం అవుతుంది. దీని ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం చెప్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా, రాష్ట్రంలోని 1.50 లక్షల పేదల ఇళ్లకు ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్లు, బీఎల్‌డీసీ ఫ్యాన్లు పంపిణీ చేయనున్నారు. విద్యుత్ ఆదా కోసం ఈ పథకం అమలు కానుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 1.50 లక్షల ఇళ్లకు ఈ విద్యుత్ పరికరాలు అందిస్తారు. ప్రతి ఇంటికి నాలుగు ఎల్‌ఈడీ బల్బులు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు 5-స్టార్ బీఎల్డీసీ ఫ్యాన్లు అందిస్తారు. వీటిని ఉపయోగించడం ద్వారా పేదల ఇళ్లలో పెద్దగా విద్యుత్ ఆదా అవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ పరికరాల సరఫరా, పంపిణీకి ఈఈఎస్ఎల్ అధికారులు పర్యవేక్షణ చేస్తారు. దేశవ్యాప్తంగా ఇంధన ఆదా చర్యలలో భాగంగా ఈ ఒప్పందం జరిగింది.

ఏపీ విద్యుత్ అధికారులు తెలిపినట్లు, ఈ బీఎల్డీసీ ఫ్యాన్లు వేడి, ఉక్కపోత కారణంగా గది ఉష్ణోగ్రతలను తగ్గించి కూలింగ్ కలిగిస్తాయి. ఈ ఫ్యాన్లు కరెంట్ ఆదా చేస్తాయని, ఎల్‌ఈడీ బల్బులు, బ్యాటెన్ ట్యూబ్ లైట్లు ఎక్కువ వెలుతురు అందజేస్తాయని, అలాగే ఎక్కువ కాలం నాణ్యత కాపాడతాయని తెలిపారు. ఇవి సాధారణ బల్బులతో పోలిస్తే తక్కువ విద్యుత్ వాడకం, ఎక్కువ కాంతిని అందిస్తాయి. దీని వల్ల కరెంట్ బిల్లులు కూడా తగ్గుతాయి. ఈ విధానం దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని, రాష్ట్రం అగ్రగామిగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టును త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.