ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సైబర్ మోసం బారిన పడి ఏకంగా రూ. 2.29 కోట్లను కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే, బాచుపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(51)కి ఫోన్ నంబరును గుర్తుతెలియని వ్యక్తులు జులై 10న ‘కేఎస్‌ఎల్ అఫీషియల్ స్టాక్’ పేరుతో ఉన్న వాట్సప్ గ్రూపులో యాడ్ చేశారు. ఈ క్రమంలోనే నారాయణ జిందాల్ అనే వ్యక్తి కోటక్ సెక్యూరిటీస్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారని, షేర్ల క్రయవిక్రయాలపై మెలకువలు నేర్పిస్తుంటారని.. గ్రూపులోని సభ్యులు తరచూ చాటింగ్ చేసేవారు. అక్టోబరు 2 నుంచి కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ స్ట్రాటజీ ప్లాన్ ప్రారంభిస్తున్నానంటూ నారాయణ జిందాల్ పేరుతో ఒక వ్యక్తి పోస్టు చేశారు. ఇందులో చేరాలంటే కోటక్ ప్రో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, వీఐపీ ట్రేడింగ్ ప్లాన్‌లో చేరితే లాభాలు వస్తాయని చెప్పి నమ్మించారు.
ఇక ఇందులో చేరినందుకు తాము భారీగా లాభాలు పొందినట్లు గ్రూపు సభ్యుల పేరుతో మెసేజ్‌లు చేస్తూ వచ్చారు. దీంతో ఇదంతా నిజమేనని నమ్మిన సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అందులోని కస్టమర్ కేర్ ప్రతినిధి సూచనల ప్రకారం డబ్బులు పంపడం ప్రారంభించాడు. మొదటిసారి రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టినందుకు 10 శాతం లాభం వచ్చినట్లు యాప్‌లో చూపించారు. దీంతో లాభాలు వస్తున్నాయి కదా అంటూ.. డబ్బులు పెడుతూ వెళ్లాడు. ఇలా పలు దఫాల్లో ఏకంగా పలు షేర్లు కేటాయిస్తున్నామని రూ. 2.29 కోట్లు బదిలీ చేయించుకున్నారు.
అయితే ఈ మొత్తంలో కేవలం రూ. 10వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇచ్చారు. రూ. 2.29 కోట్ల పెట్టుబడికి రూ. 1.10 కోట్ల లభం వచ్చిందంటూ చూపించారు. మొత్తం రూ. 3.29 కోట్లు విత్‌డ్రా చేయాలంటే మరో రూ.40 లక్షలు కట్టాలని చెప్పారు. డబ్బు మొత్తం విత్‌డ్రా చేసుకోవాలంటే రకరకాల నిబంధనలు చెప్పడంతో అనుమానం వచ్చింది. దీంతో మోసపోయోనన్న విషయం అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.