శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టి 100వ ప్రయోగం విజయవంతమైంది. ఎన్వీఎస్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా పంపింది. భారత భూభాగం నుంచి దాదాపు 1500 కి.మీ వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో కచ్చితమైన స్థానం, వేగం, సమయం వంటి సేవలను ఇది అందించనుంది.
27 గంటల కౌంట్‌డౌన్ అనంతరం బుధవారం ఉదయం 6.23 గంటలకు క్రయోజనిక్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్వీఎస్-02 కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. దీని బరువు మొత్తం 2,250 కిలోలు. పదేళ్ల పాటు ఇది సేవలు అందించనుంది. ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ కక్ష్యలోకి విజయవంతంగా చేరింది.
ప్రయోగం పూర్తయిన తర్వాత షార్ కేంద్రంలో ఇస్రో ఛైర్మన్ మాట్లాడుతూ ఈ ఏడాది చేపట్టిన మొట్టమొదటి ప్రయోగం విజయవంతమైందని చెప్పారు. నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. ఈ వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ 1979 ఆగస్టు 10 నింగిలోకి దూసుకెళ్లింది. ఇది జరిగిన దాదాపు 46 ఏళ్ల తర్వాత 100వ రాకెట్ మైలురాయిని అందుకుంది. ఇస్రో భారీ ప్రయోగాలన్నీ శ్రీహరికోట నుంచే నిర్వహిస్తోంది.