హైడ్రోజన్ రైలు : మరో అద్భుతమైన ప్రాజెక్టుకు భారతీయ రైల్వే శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది చివరికల్లా తొలి హైడ్రోజన్ రైలును పట్టాలెక్కించేందుకు సిద్ధమవబోతుంది
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల సెమీ హైస్పీడ్ రైళ్లుగా చెబుతున్న వందేభారత్‌ను పట్టాలెక్కించింది. వీటితో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించింది. తాజాగా మరో అద్భుతమైన ప్రాజెక్టుకు భారతీయ రైల్వే శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది చివరికల్లా తొలి హైడ్రోజన్ రైలును పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతోంది.
రైల్వే శాఖ హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ వరకు ఈ రైలును నడపాలని ప్లాన్ చేస్తోంది. “హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్” ప్రోగ్రామ్ కింద దశల వారీగా 35 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే జర్మనీకి చెందిన టీయూవీ-ఎస్‌యూడీ సంస్థ రైలు భద్రతకు సంబంధించిన సేఫ్టీ ఆడిట్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
హైడ్రోజన్ రైలు ఖర్చు : ఈ హైడ్రోజన్ రైలు ఒక్క యూనిట్ ఖరీదు రూ.10 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఒక్కో రైలుకు సుమారు రూ.80 కోట్ల మేర ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సిద్ధం చేయడానికి రూ.70 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్ బ్యాటరీ, రెండు ఇంధన యూనిట్లను విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. మొదటి రైలు నమూనాను హర్యానాలోని 89 కి.మీ జింద్-సోనిపట్ మార్గంలో పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇంటిగ్రేషన్ పనులు కొనసాగుతున్నాయి.
హైడ్రోజన్ రైలు నడుపుతున్న ఐదో దేశంగా అవ్వబోతున్న భారత్ : ఈ ప్రాజెక్టు ద్వారా జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా తర్వాత హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోనే ఐదో దేశంగా భారత్ ఘనత దక్కించుకోనుంది. ఫ్రెంచ్ కంపెనీ తొలిసారిగా హైడ్రోజన్ రైలును సిద్ధం చేసింది. 2018 నుంచి ఫ్రాన్స్‌లో ఈ హైడ్రోజన్ రైలు నడుస్తోంది. భారత్‌లో మాత్రం ఈ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జింద్-సోనిపట్ సెక్షన్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. హైడ్రోజన్ ఇంధన కణాల సాయంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ హైడ్రోజన్ ఈ రైలులో 4 కోచ్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. నీలగిరి మౌంటైన్ రైల్వే, డార్జిలింగ్ హిమాలయన్, కల్కా సిమ్లా రైల్వే, కాంగ్రా వ్యాలీ, బిల్మోరా వాఘై, మార్వార్ దేవ్‌గర్ మదారియా మార్గాల్లో ఈ రైలును నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఈ రైలులో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.