పౌరసేవలు అందించేందుకు దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. దీని కోసం అధికారిక వాట్సప్ నంబర్ 919552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ఐటీ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ పరిపాలన సంస్కరణల్లో ఇది ఒక చారిత్రాత్మక రోజు. “మన మిత్ర” పేరుతో దేశంలోనే మొదటి సారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభిస్తున్నాం. గతంలో చంద్రబాబు గారు ఈ గవర్నన్స్‌తో ముందుకు వస్తే, ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నాం. యువగళం పాదయాత్రలోనే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన నాకు మొదలైంది. అందుకే ఈ రోజు మన మిత్ర – ప్రజల చేతిలో ప్రభుత్వం.. ప్రజల చేతిలోనే పాలన.. మాది ప్రజా ప్రభుత్వం నినాదంతో, వాట్సాప్ గవర్నెన్స్ సేవలతో ప్రజల ముందుకు వస్తున్నాం. వేగంగా పౌరసేవలు, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ పని చేస్తుంది.
వాట్సాప్ అందరూ వాడే ఫోన్ అప్లికేషన్. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సేవలు తీసుకు రాలేదు. ఎంవోయూ చేసుకున్న 3 నెలల 9 రోజుల్లోనే దీనిని ప్రారంభిస్తున్నాం. 9552300009 వాట్సాప్ నెంబర్ ద్వారా, 36 ప్రభుత్వ డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేస్తూ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏపీ ప్రభుత్వం 161 సేవలు అందిస్తుంది. రెండో విడతలో వాట్సాప్‍లో 360 సేవలను అందుబాటులో ఉంచుతాం. రెండో విడత వాట్సాప్ గవర్నెన్స్ కు ఏఐను కూడా జోడిస్తాం. ప్రతి సర్టిఫికెట్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. వాట్సాప్ గవర్నెన్స్ తో ఎక్కడా నకిలీకి ఆస్కారం ఉండదు. ఈ రోజే వాట్సాప్ గవర్నెన్స్ మొదలు పెట్టాం. లోటు పాట్లు అన్నీ సరి చేస్తాం. ఆరు నెలల్లోనే మరిన్ని ప్రభుత్వ సేవలకు విస్తరణ చేసి, పూర్తి స్థాయిలో పని చేసేలా చేస్తాం. ఈ రోజు నేను యువగళంలో ఇచ్చిన మరో హామీని నేరవేర్చినందుకు సంతోషిస్తున్నా. మాది ప్రజా ప్రభుత్వం, ప్రజల చేతుల్లో పాలన ఉండాలన్నదే మా ఉద్దేశం అని లోకేష్ అన్నారు.