- విద్యాశాఖలో సంస్కరణలకు మంత్రి నారా లోకేశ్ సిద్ధమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపరచే విధంగా రాబోయే ఆరు నెలల్లో అనేక మార్పులు తీసుకొచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
- రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం రోజునే 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ‘డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర’ కిట్లను అందించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు పోటీ పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్ రికార్డులు అందచేయనున్నారు. బడుల స్టార్ రేటింగ్‌ను మెరుగుపరచేందుకు పాఠశాలల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంచేందుకు ఆటలకు సంబంధించిన సామగ్రిని అందించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లోనూ కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు.