భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు డ్రా అనంతరం రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన వెలువడింది. 38 ఏళ్ల అశ్విన్ టెస్టు ఫార్మాట్ లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఉన్నారు. లెజండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో అశ్విన్ ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ లో జట్టులో భాగంగా ఉన్నాడు.
బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ లో ఇప్పటికి మూడు మ్యాచ్ లు పూర్తి కాగా అందులో అశ్విన్ ఒక మ్యాచ్ లో మాత్రమే బరిలోకి దిగాడు. రెండో టెస్టులో ఆడిన అశ్విన్ ఒక వికెట్ సాధించాడు. మూడో టెస్టు కోసం అశ్విన్ స్థానంలో జడేజాను జట్టులోకి తీసుకున్నారు. భారత క్రికెటర్ గా ఇదే నా ఆఖరి సంవత్సరం అంటూ బ్రిస్బేన్ టెస్టు అనంతరం రవిచంద్రన్ అశ్విన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. మూడో టెస్టు 5వ రోజు ఆట వర్షంతో నిలిచిపోయిన సమయంలో కోహ్లీతో అశ్విన్ చాలాసేపు మాట్లాడాడు.
అశ్విన్ 106 టెస్టుల్లో 537 వికెట్లు సాధించాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఉన్నాడు. తొలి స్థానంలో అనిల్ కుంబ్లే (619 వికెట్లు) ఉన్నాడు. ఇక బ్యాటింగ్ లో కూడా అశ్విన్ అదరగొట్టాడు. 106 టెస్టుల్లో 3,503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలర్ గా మొదలు పెట్టినా టెస్టుల్లో ఆల్ రౌండర్ వరకు అశ్విన్ ఎదిగాడు. ఇక వన్డేల్లో 116 మ్యాచ్ ల్లో 156 వికెట్లు తీశాడు. టి20ల్లో 65 మ్యాచ్ లు ఆడిన అతడు.. 72 వికెట్లు సాధించాడు. వన్డే, టి20లతో పోలిస్తే టెస్టుల్లో అశ్విన్ సూపర్ సక్సెస్ అయ్యాడు.