ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4 నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాలలోని ప్రధాన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయనుంది. ఈ స్లాట్ బుకింగ్ విధానం ద్వారా ప్రజలు తమకు కావలసిన సమయానికి స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ఈ కొత్త విధానంతో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి తప్పుతుందనిn రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ ద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లకు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మిగిలిన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈ నెల చివరినాటికి ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.
రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ హరినారాయణన్ దీని ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ తగ్గుతందని.. రిజిస్ట్రేషన్ పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. గత నెల 10న కంకిపాడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో డిజిటల్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించామని.. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ విధానంతో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.
ఈ స్లాట్ బుకింగ్ విధానం ద్వారా కొనుగోలుదారులు, అమ్మేవారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో సిబ్బందిపై ఒత్తిడి తగ్గుతుంది అంటున్నారు. దళారుల ప్రభావం కూడా తగ్గుతుందని.. డాక్యుమెంట్లు సరిచూసుకోవడంలో గందరగోళం ఉండదంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తప్పుతాయని.. అధికారులతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. స్లాట్ బుక్ చేసుకోవడానికి ఐజీఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్, ఇతర సేవలకు కావలసిన తేదీ, సమయాన్ని ఎంచుకున్నాక క్యూఆర్ కోడ్‌తో ఒక టోకెన్ వస్తుంది. ఆ సమయంలో టోకెన్, పత్రాలతో కార్యాలయానికి వెళితే గంటలో పని పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. ఈ స్లాట్ విధానం ద్వారా క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. సకాలంలో క్రయవిక్రయదారులు, సాక్షులు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకోవచ్చు.
అంతేకాదు ఎనీవేర్ విధానంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే.. నిర్ణీత తేదీకి ముందురోజు సంబంధిత పత్రాలను ఆన్‌లైన్‌లో కార్యాలయానికి చేరేలా చూడాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ సేవలకు ఎలాంటి రుసుము లేదు. ఒకవేళ స్లాట్ బుకింగ్‌ను రద్దు చేసుకుంటే రూ.100 చెల్లించాలనే నిబంధన పెట్టారు. ఒకవేళ తిరిగి అదే సేవలను పొందాలంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కోసం సరికొత్తగా ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొస్తోంది.