ఇన్వెస్టర్లకు అలర్ట్, మార్కెట్‌లోకి మరో భారీ ఐపీఓ ఎంట్రీ ఇవ్వబోతోంది. గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్‌లో IPOల హంగామా నడుస్తోంది. వరుసపెట్టి వస్తున్న ఐపీఓలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ ఏడాది దిగ్గజ కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూలు క్యూ కట్టాయి. ఇదే బాటలో తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy) ఐపీఓ సిద్ధమైంది. రూ.11,300 కోట్లు సమీకరించడం లక్ష్యంగా ఈ ఐపీఓ రాబోతోంది. ఇప్పటికే సెబీ నుంచి అనుమతి కూడా లభించిందట.
స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ నవంబర్ 6 నుంచి 8 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 5న విండో తెరుచుకోనుంది. ఈ IPO ధరల శ్రేణి రూ.371-390గా నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఐపీఓలో భాగంగా రూ.6,800 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత వాటాదారులు తమ షేర్లు విక్రయించనున్నారు. మరో రూ.4500 కోట్లు ఫ్రెష్ షేర్ల జారీ జరగనుంది.