- కేంద్ర ప్రభుత్వం సహకారం కోరిన ఏపీ ఐటీ, విద్య శాఖా మంత్రి
- కేంద్ర మంత్రి, సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్‌షిప్ అధికారులతో భేటీ
- స్కిల్ సెన్సస్ పై లోకేష్ స్పెషల్ ప్రెజెంటేషన్
- అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామన్న కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ ప్రణాళికలు, దేశంలోనే మొదటిసారిగా జరుగుతున్న స్కిల్ సెన్సస్‌కి సహకారం అందించాలని కేంద్ర మంత్రి, సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ అధికారులను ఏపీ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు.
ఢిల్లీలోని కౌశల్ భవన్‌లో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ శాఖ కేంద్రమంత్రి జయంత్ చౌధురి, సెక్రటరీ అతుల్ కుమార్ తివారీ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో వేద్ మణి తివారీలతో ఏపీ మంత్రి నారా లోకేష్, ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో చేపట్టనున్న స్కిల్ సెన్సస్‌పై మంత్రి లోకేష్ స్పెషల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. స్కిల్ సెన్సస్ లక్ష్యం, ఎలా చేపడుతున్నారని కేంద్రమంత్రి ఆరా తీశారు. స్కిల్ సెన్సస్ పైలెట్ ప్రాజెక్టు పూర్తి కాగానే గుర్తించిన లోటుపాట్లు సరిచేసి రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని లోకేష్ వివరించారు. కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో లక్షలాది ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ సెన్సస్ చేపట్టిందని మంత్రి తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ లక్ష్యం చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మంత్రిత్వశాఖల నుంచి ఏపీకి ఏమేం కావాలో వివరిస్తూ ఓ లేఖను మంత్రి నారా లోకేష్ అందజేశారు.
నారా లోకేష్ కోరిన సంస్థలు, సహకారం:
- విజనరీ లీడర్ చంద్రబాబు గారి నాయకత్వంలో నైపుణ్యం గల మానవవనరులను రాష్ట్రం నుంచి అందించే లక్ష్యంగా పనిచేస్తున్నామనీ, దీని కోసం స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర సంస్థలు ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు.
- పబ్లిక్-ప్రైవేటు పార్టనర్షిప్ (PPP) మోడల్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ అమరావతిలో నెలకొల్పాలి.
- వారణాసి, హైదరాబాద్ నగరాలలో విజయవంతంగా నడుస్తున్న మాదిరిగానే స్కిల్ ఇండియా ఇంటర్నేషన్ సెంటర్ అమరావతిలో కావాలి.
- గతంలోనే విశాఖపట్నంలో ఏడు ఎకరాలు కేటాయింపు జరిగిన చోట నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలి.
- మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యూయలరీ, అమరావతిలో నిర్మాణరంగం, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, చేనేత-హస్తకళలు, విశాఖలో ఫార్మా లాబ్స్, నెల్లూరు, తిరుపతిలో ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలు నెలకొల్పేందుకు స్కిల్ కౌన్సిల్ సహకారం అందించాలి.
- పీఎంకేవీవై (ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన) కేటాయింపులు జరగాలి.
- నేషనల్ స్కిల్ డెలవప్మెంట్ వెబ్ సైట్లతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అనుసంధానం చేయాలి.
- గిరిజనుల నైపుణ్య శిక్షణ కేంద్రాలు నెలకొల్పేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి.
ఢిల్లీ కౌశల్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖల మంత్రి నారా లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ & సీఈవో గణేష్ కుమార్, ఈడీ దినేష్‌కుమార్ పాల్గొన్నారు.