గీజర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు జరిగే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం పెరుగుతోంది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో చలి నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇక చలికాలంలో ఉదయమే నిద్రలేచి స్నానం చేయడం పెద్ద టాస్క్. అందుకే చాలా మంది వేడినీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు . ఈ క్రమంలో శీతాకాలంలో గీజర్ ల వాడకం ఎక్కువవుతుంది. చల్లని నీటిని ఇది వేడి చేసి అందిస్తుండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వెచ్చవెచ్చగా స్నానం చేయొచ్చు. అయితే, గీజర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు జరిగే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
గీజర్‌ని ఎక్కడపడితే అక్కడ అమర్చకూడదు. బాత్‌రూంలోని పై భాగంలో ఫిట్టింగ్ చేయించుకోవాలి. తక్కువ ఎత్తులో అమరిస్తే స్నానం చేసేటప్పుడు నీళ్లు ఆ గీజర్‌పై పడి పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరచూ ఎక్కువవయ్యాయి. బాత్ రూం సైజు ఇరుకుగా ఉన్నా, చేతులు తగిలినా ఊహించని ప్రమాదాలు జరగొచ్చు. ఇక, చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి. కాబట్టి, గీజర్‌ని ఎప్పుడూ టాప్‌లోనే సెటప్ చేయించుకోవాలి.
చీప్ గీజర్లతో అన్ని విధాలుగా నష్టమే తప్ప బెనిఫిట్స్ ఉండవు. పైగా, ఈ తరహా లోకల్ కంపెనీలు కూడా సేఫ్టీ స్టాండర్డ్స్‌ని పెద్దగా పట్టించుకోవు. దీంతో ఇవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాకుండా కొద్దిగా వేడి ఎక్కువైనా పేలిపోవచ్చు. కాబట్టి, సర్టిఫైడ్ కంపెనీ నుంచే గీజర్‌లను కొనాలి. మీరు కొనుగోలు చేసే గీజర్‌కి అన్ని రకాల క్లియరెన్సులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం తప్పనిసరి.