కెనడాలో మరోసారి ఖలిస్తానీ శక్తులు విధ్వంసానికి తెరతీశాయి. భారత్ కు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనల్లో పలువురిపై దాడికి దిగారు. రోడ్లపై తరుముతూ కర్రలతో దాడి చేశారు.

ఒట్టావా: కెనడాలో మరోసారి భారత వ్యతిరేక శక్తులు అరాచకం సృష్టించాయి. భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్తాన్ మద్దతు దారులు ప్రదర్శన చేపట్టారు. ఇండియాకు మద్దతుగా నిలిచిన వారిపై దాడులకు దిగారు. ఆదివారం కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న హిందూ దేవాలయానికి వచ్చిన వారిపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేశారు. దాడి చేసిన వారి చేతుల్లో ఖలిస్తాన్ జెండాలు ఉన్నాయి. ఆలయంలో ఉన్న వారిపై కర్రలతో దాడికి తెగబడ్డారు.

ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంలో ఈరోజు జరిగిన హింసను మేం అంగీకరించబోం. ప్రతి కెనడియన్‌కు తన మతాన్ని స్వేచ్ఛగా , సురక్షితంగా ఆచరించే హక్కు ఉంది అని ట్రూడో తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ప్రజలు సంయమనం పాటించాలని పీల్ ప్రాంతీయ పోలీసు చీఫ్ నిషాన్ దురైప్ప విజ్ఞప్తి చేశారు.

కెనడాలోని హిందూ దేవాలయంలో జరిగిన విధ్వంసం, దాడి ఘటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒట్టావాలోని భారత హైకమిషన్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. టొరంటో సమీపంలోని బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వద్ద భారత వ్యతిరేక శక్తులు ఉద్దేశపూర్వక హింసకు పాల్పడ్డాయని భారత హైకమిషన్ పేర్కొంది. భారతీయ పౌరుల భద్రత అంశంలో ఇదెంతో ఆందోళన కలిగించే విషయమని అన్నారు.