ఇండియాలో మొబైల్ ఫోన్స్ వాడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్లు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్స్‌తో లాంచ్ అవుతున్నాయి. ఇండియాలో అన్ని రకాల స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ ఉంటుంది. దీంతో కంపెనీల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. 2024, మూడవ త్రైమాసికం (జులై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య)లో భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్స్ 9% పెరిగాయి. ఈ వ్యవధిలో మొబైల్ బ్రాండ్లు మొత్తం 4 కోట్ల 71 లక్షల ఫోన్లు షిప్పింగ్ చేశాయి. ఈ మూడు నెలల్లో షియోమీ, శామ్‌సంగ్, యాపిల్ బ్రాండ్ల కంటే వివో కంపెనీ ఫోన్లే ఎక్కువగా షిప్ అయ్యాయి. దాంతో ఇండియాలో ఈ క్వార్టర్‌లో వివో (Vivo) మోస్ట్ పాపులర్ బ్రాండ్‌గా నిలిచింది.

ఇంతకుముందు ఇండియాలో నంబర్ 1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఉన్న షియోమీని వివో అధిగమించింది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. మాన్‌సూన్ సేల్స్‌ కారణంగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ దుకాణాల్లో స్మార్ట్‌ఫోన్లు భారీగా అమ్ముడు అవుతాయని కంపెనీలకు తెలుసు, అందుకే ఎక్కువ ఫోన్లను ఎక్స్‌పోర్ట్ చేశాయి. పండుగ సీజన్‌కు ముందు స్టాక్‌ను క్లియర్ చేసేందుకు కూడా అధికంగా ఫోన్లను షిప్ చేశాయి. అంతేకాదు, కస్టమర్లను ఆకట్టుకునే లాగా కళ్లు చెదిరే ఆఫర్లు తీసుకొచ్చాయి. అందుకే సేల్స్ కూడా ఎక్కువగా జరిగాయి.

వివో నంబర్ వన్ గా

భారతదేశంలో ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 91 లక్షల వివో కంపెనీ ఫోన్లు షిప్ అయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే 26 శాతం ఎక్కువగా ఈ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు షిప్ అయ్యాయి. ఇప్పుడు భారతదేశంలో టోటల్ స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్స్‌లో 19 శాతం వివో కంపెనీ ఫోన్లే ఉండటం విశేషం. గత ఏడాది ఈ సంఖ్య 17 శాతం మాత్రమే. గత ఏడాది 72 లక్షల వివో కంపెనీ షిప్ అయ్యాయి. కానీ డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల వీటి షిప్‌మెంట్స్ కూడా పెరిగాయి. వివో కంపెనీ ఆన్‌లైన్‌ ద్వారా ఎక్కువ ఫోన్లు విక్రయిస్తుంది. ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా ఎక్కువ మోడల్స్ సేల్ చేస్తుంది. అందుకే ఈ కంపెనీ మొబైల్స్ ఇతర కంపెనీల కంటే ఎక్కువగా ఇండియాకు షిప్ అవుతున్నాయి.